PEDRO PARDO / AFP

కరోనా వైరస్ వ్యాప్తిపై వార్తలు సేకరిస్తున్న విలేకరుల భద్రత కోసం సీపీజే జాగ్రత్తలు..

మే 20, 2021న సవరించిన సమాచారం

కోవిడ్-19(నావల్ కరోనా వైరస్)ను మార్చి 11, 2020న  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)  మహమ్మారిగా ప్రకటించింది.  ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు క్రమేపీ బయటకు తెలుస్తుండడంతో, భద్రతా చర్యల్లో భాగంగా వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్నాయి లేదా పెంచుతున్నాయి. పత్రికా కథనాల ప్రకారం, కొత్తగా కరోనా వైరస్ వేరియంట్లను గుర్తిస్తున్నారు. కొవిడ్-19 టీకా కార్యక్రమం వేగం పుంజుకుంటోంది

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విపత్కరమైన పరిస్థితులు నెలకొన్నాయి. CPJ డాక్యుమెంట్ చేసినట్లు తీవ్రమైన అనిశ్చిత వాతావరణంలో పాత్రికేయులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందో  దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో  ప్రజలకు తెలియజేస్తోంది జర్నలిస్టులే.  బాధ్యతల నిర్వహణలో భాగంగా పాత్రికేయులు అనేక ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఎంతోమందిని కలిసి ఇంటర్వ్యూలు చేయాల్సి ఉంటుంది.  CPJ ఇటీవలి రిపోర్టింగ్‌లో హైలైట్ చేసినట్లు  నిరంతర  ప్రయాణాలు, ఎప్పుడూ ఎవరో  ఒకరిని కలుస్తూ ఉండటం వల్ల పాత్రికేయులు కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యే అవకాశాలు కొట్టిపారేయలేనివి.

తాజా సూచనలు, ఆంక్షలను ఎప్పటికప్పుడు వివరించడానికి, మహమ్మారి వార్తలను కవర్ చేసే పాత్రికేయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించే సమాచారంతోపాటు స్థానిక ప్రజారోగ్య సంస్థ అందించే సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మహమ్మారి తాజా సమాచారం కోసం, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ విశ్వసనీయ, సురక్షిత వనరు.

విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాల్సిందే..!

అంతర్జాతీయ రవాణా ఆంక్షలు అంటే రక్షణ చర్యలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.  ముందస్తుగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా లేదా స్వల్ప నోటీసుతోనే నిర్ణయాలను రద్దు చేయవచ్చు. లేదా మార్చవచ్చు.

ఇప్పటికే టీకాలు తీసుకున్న మీడియా సిబ్బంది తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, వారు ఇప్పటికీ వైరస్ ను మరొకరికి అంటించే అవకాశం ఉంది. యేల్ మెడిసిన్ ప్రకారం, వివిధ రకాల వేరియంట్లకు సంబంధించి విభిన్న టీకాలు వేర్వేరు స్థాయుల్లో రక్షణను అందిస్తాయి. అందుకే, కొవిడ్ -19కు సంబంధించిన భద్రతా చర్యలు అంటే, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా కొనసాగించాల్సిందే.

కోవిడ్-19 వార్తా ప్రక్రియలో నిమగ్నమైన పాత్రికేయులారా… జాగ్రత్త జాగ్రత్త!

ప్రీ అసైన్మెంట్:

అందుబాటులో ఉంటే, మీరు సురక్షితంగా ఉండేందుకు ఏ కంపెనీది అయినా సరే ముందుగా కొవిడ్-19 టీకా తీసుకోండి. మరీ ముఖ్యంగా, ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మీరు వెళుతున్నా లేదా ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్నా ఇది తప్పనిసరి.

మీరున్న ప్రాంతంలో లేదా మీరు వెళ్లే ప్రాంతంలో ఇన్ఫెక్షన్ రేటు ఎంత ఎక్కువగా ఉందన్న దానిని బట్టి, వైరస్ మీకు సోకే ముప్పును తగ్గించుకోవడానికి వ్యక్తిగతంగా వెళ్లడానికి బదులుగా ఫోన్ లేదా ఆన్ లైన్ ఇంటర్వ్యూలను తీసుకోండి.

సీడీసీ ప్రకారం, వృద్ధులు, మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులకు ముప్పు ఎక్కువ. మీరు ఈ కేటగిరీకి చెందిన వారు అయితే మరియు, ఇన్ఫెక్షన్ రేటును దృష్టిలో ఉంచుకుని, సాధారణ ప్రజలను నేరుగా కలిసే ఎటువంటి కార్యక్రమంలో అయినా మీరు పాల్గొనవద్దు. ఈ విషయంలో గర్భిణులుగా ఉన్న ఉద్యోగులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన వార్తలను సేకరించేందుకు విలేకరులను ఎంపిక చేసే ముందు, ద న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన ప్రకారం, కొందరు జాతీయులపై జాతి విద్వేష దాడులు జరిగే ప్రమాదాన్ని యాజమాన్యాలు దృష్టిలో ఉంచుకోవాలి.

అసలు ఎటువంటి హెచ్చరిక చేయకుండా లేదా చిన్నపాటి హెచ్చరికతోనే ప్రపంచవ్యాప్తంగా రవాణా ఆంక్షలు లేదా లాక్ డౌన్ నిబంధనలు మారవచ్చు. వార్తా సేకరణ క్రమంలో అనారోగ్యం బారిన పడితే  ఎలాంటి సహాయ సహకారాలు పాత్రికేయులకు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని యాజమాన్యంతో చేర్చాలి. కొంతకాలం పాటు ‘లాక్ డౌన్, వ్యక్తిగత ఐసోలేషన్’ పాటించాల్సి వస్తే యాజమాన్య బృందం ఎలా సహకరిస్తుంది, అందుకు సంబంధించి వారి ప్రణాళికలేమిటి అన్న విషయాలనూ కూలంకషంగా చర్చించాలి. 

మానసిక స్థైర్యం కీలకం:

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ కథనం ప్రకారం, కొవిడ్-19కు సంబంధించిన వార్తలను అందించే క్రమంలో ఎంతో అనుభవజ్ఞులైన పాత్రికేయులు కూడా మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 

ప్రమాదకరంగా విస్తరిస్తున్న కోవిద్ – 19  సమాచార సేకరణకు పాత్రికేయులు సమాయత్తమైతే తొలుత ఆందోళన చెందేది వారి వారి కుటుంబ సభ్యులే. విధుల నిర్వహణకు వెళుతున్న ప్రాంతంలో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో తెలియజెప్పాలి. ఆమేరకు కుటుంబ సభ్యుల భయాలేమిటో అడిగి తెలుసుకోవాలి. వారితో మనసు  విప్పి చర్చించాలి.  కుటుంబ సభ్యుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు మీడియా సంస్థకు చెందిన వైద్య సలహాదారులతో వారిని మాట్లాడించాలి. కోవిడ్-19 వైరస్ ప్రబలిన ప్రాంతాల నుంచి రిపోర్టింగ్ చేయడం కలిగించే మానసిక ఒత్తిడిని పరిగణనలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా  ఆసుపత్రుల నుండి, ఐసొలేషన్ సెంటర్ల నుండి లాక్ డౌన్ జోన్ నుంచి రిపోర్టింగ్ చేయడం తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. ఈ పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే పాత్రికేయులకు  ‘డార్ట్ సెంటర్ ఫర్ జర్నలిజం అండ్ ట్రౌమా‘ అవసరమైన సమాచారం అందించి, సరైన దిశా నిర్దేశం చేస్తోంది. 

COVID-19 ని కవర్ చేసే జర్నలిస్టులకు మానసిక ఆరోగ్య ఉత్తమ పద్ధతుల కోసం, భద్రతా వనరుల కోసం CPJ అత్యవసర పేజీని సందర్శించండి.

వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి:

చాలా దేశాల్లో సామాజిక దూరాన్ని అవలంబిస్తూ ఉన్నారు. మీరు ఏ దేశంలో నివశిస్తున్నారన్న విషయాన్ని బట్టి, నిర్దేశిత దూరంలో మార్పులు ఉన్నా.. చాలా దేశాలు సామాజిక, భౌతిక దూరాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఈ కింద పేర్కొన్న హైరిస్క్ ప్రాంతాల నుంచి మీరు రిపోర్టింగ్ చేస్తున్నారనుకోండి.. అక్కడి  ప్రదేశాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో ముందే సమాచారం సేకరించండి.  అనుమానం వస్తే ఆ ప్రదేశాలకు వెళ్ళకండి. 

ఎటువంటి ఆస్పత్రులు ఉన్నాయి?

వృద్ధాశ్రమాల పరిస్థితి ఏమిటి?

జబ్బు పడిన వారు, వృద్ధులు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి ఇల్లు.

వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించే పని ప్రదేశం (ఉదాహరణకు, మాంసం ప్రాసెస్ చేసే ప్లాంటు)

మార్చురీ, శ్మశాన వాటిక, అంత్యక్రియల సేవలు

క్వారంటైన్, ఐసొలేషన్, లాక్ డౌన్ జోన్

జన సాంధ్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతం (ఉదాహరణకు, మురికివాడ లేదా ఇరుకిరుకు నగరం)

కొవిడ్ -19 కేసులున్న పునరావాస శిబిరం లేదా ఖైదీలు/నిర్బంధ కేంద్రం 

సమస్య బారిన పడకుండా పాటించాల్సిన ప్రమాణాలు: 

నిర్దేశిత నిబంధనల ప్రకారం, ప్రతి ఒక్కరి నుంచీ సురక్షిత భౌతిక దూరాన్ని పాటించండి. స్థానిక అధికార యంత్రాంగాల ప్రకారం వీటిలో మార్పులు ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండాలి. ఎవరైతే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి దూరంగా ఉండడమే మంచిది. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా మేలు.

బయటి ప్రదేశాల్లోనే వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ లోపల ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి వస్తే, గాలి ప్రసారం చక్కగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి (ఉదాహరణకు, కిటికీలు తెరిచి ఉండడం) మరియు ఇరుకిరుకు ప్రదేశాలకు వెళ్లవద్దు.

కరచాలనాలు, ఆలింగనాలు, ముద్దులు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించండి.

వయసు పైబడిన వ్యక్తులను, రోగ లక్షణాలు ఉన్న వారిని ఇంటర్వ్యూ చేసే సమయంలో జర్నలిస్టులు చాలా జాగ్రత్తగా ఉంటూ వీలైనంత దూరం పాటించాలి. 

కోవిద్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలనూ, తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో  పనిచేస్తున్న  ఉద్యోగులను ఇంటర్ వ్యూ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ..  సురక్షిత భౌతిక దూరం పాటించాలి.

చేతులను వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. 20 సెకండ్ల పాటూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అది కూడా సరైన విధానంలో కడుక్కోవాలి. చేతులను శుభ్రంగా తుడుచుకోవాలి. ఇతర వస్తువులను తాకినా వెంటనే చేతులు కడుక్కోవడం ముఖ్యం. చేతులు శుభ్రంగా ఎలా కడుక్కోవాలి అన్న నియమావళిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో పొందుపరిచారు.    

వేడి నీళ్లు, సోప్ అందుబాటులో లేని సమయంలో యాంటీ-బాక్టీరియల్ జెల్ ను, వైప్స్ ను వినియోగించండి.(ఆల్కహాల్ ఉన్న శానిటైజర్లను వినియోగించమని CDC చెబుతోంది)  హ్యాండ్ వాష్ చేయకున్నా పర్వాలేదు.. శానిటైజర్లను వాడితే చాలు అని మాత్రం అనుకోకండి.

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తప్పకుండా ముక్కుకు, నోటికి టిస్యూ పేపర్ ను అడ్డుపెట్టుకోండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాడిన టిష్యూలను వెంటనే డస్ట్ బిన్ లలో వేసేయండి. ఆ తర్వాత చేతులు కడగడం మాత్రం మరువద్దు.

ముఖాన్ని, ముక్కును, నోటిని, చెవులను తాకడం మానుకోవాలి.

కరచాలనం ఇవ్వడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి వాటిని మానేస్తే చాలా మంచిది. అందుకు ప్రత్యామ్నాయంగా పరస్పరం మోచేతులు తగిలించి (ఎల్బో) అభినందనలు తెలుపుకోవడమో, పాదాలను తాటించి (లెగ్ బంప్) శుభకామనాలు తెలుపుకోవడమో అలవాటు చేసుకోండి. 

ఇతరులు వాడిన పాత్రల్లో తినడం, తాగడాన్ని సాధ్యమైనంతవరకూ మానుకోవాలి.

జుట్టంతా కప్పుకొని ఉండాలి. జుట్టు పొడుగ్గా ఉంటే దానికి ముడి కట్టుకోండి. 

విధి నిర్వహణలో  ఆభరణాలను, గడియారాన్ని తీసేయడం చాలా మంచిది. ఎందుకంటే కోవిద్-19 వైరస్ పలు లోహాల మీద నిర్దిష్టకాలం పాటు సజీవంగా ఉంటుంది. 

విధి నిర్వహణలో సాధ్యమైనంత వరకూ కాంటాక్టు లెన్సులను వాడవద్దు. వాటి కారణంగా మీరు తరచూ మీ కళ్లను తాకే అవకాశం ఉంటుంది. దాంతో, ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలూ పెరుగుతాయి.

శుభ్రంగా ఉతకడానికి వీలుగా ఉండే బట్టలనే ధరించడం ఉత్తమం. కొన్ని వస్త్ర రకాలమీద వైరస్ దీర్ఘ కాలం పాటు సజీవంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుచుకోవాలి.  వేసుకున్న బట్టలను విధి నిర్వహణ తరవాత అధిక ఉష్ణోగ్రత కలిగిన నీటిలో డిటర్జెంట్ ను ఉపయోగించి ఉతకడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.

మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే  ప్రజా రవాణాను ఉపయోగించకపోవడం అత్యుత్తమం. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో, ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణాలను చేయవద్దు. ఏవైనా హ్యాండిల్స్ ను ముట్టుకున్నా వెంటనే శానిటైజర్లను వాడండి.

కంపెనీ లేదా సొంత వాహనంలో వెళ్లే సమయంలో వాహనంలోనే పక్కన  వైరస్ సోకిన  ప్రయాణికుడు ఉంటే ప్రమాదం సోకె అవకాశాలు అత్యధికంగా ఉంటాయన్న విషయాన్ని గమనంలో ఉంచుకోండి. ప్రయాణ సమయంలో కిటికీలు తెరిచి ఉంచితే వాహనం అంతటా గాలి చక్కగా ప్రసరిస్తుంది. అలాగే, వాహనంలో ఫేస్ కవరింగులు, ఫేస్ మాస్కులు ఉపయోగించడం మంచిది.పని చేసే సమయంలో వీలైనన్ని ఎక్కువ సార్లు విరామాలు తీసుకోవడం మంచిది. తీవ్రమైన పని ఒత్తిడిలో, బాగా అలసిపోయినప్పుడు పారిశుధ్యానికి సంబందించిన మౌలిక విషయాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది.  ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకే ప్రయత్నించండి. కొందరు ఉద్యోగం అయిపోయాక చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవడం చాలా మంచిది.

మీ భద్రత… మీ బాధ్యత

తమకు అప్పగించిన అస్సైన్ మెంట్ ను బట్టి, సురక్షితంగా వార్తలను సేకరించడానికి పాత్రికేయులు విభిన్న రకాల మెడికల్ పీపీఈలను వాడాల్సి రావచ్చు. వీటిలో డిస్పోజబుల్ గ్లవుజులు, ఫేస్ మాస్కులు, సురక్షిత యాప్రాన్లు/ఓవరాల్స్/బాడీ సూట్లు, డిస్పోజబుల్ షూ కవర్లు తదితరాలు ఉంటాయి.

మెడికల్ పీపీఈలను సురక్షితంగా ధరించడం, తొలగించడానికి అత్యుత్తమ భద్రతా పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. వాటిని తప్పక అమలు చేయాల్సి ఉంటుంది. సీడీసీ అందించే సాధారణ మార్గనిర్దేశాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పీపీఈని తొలగించేటప్పుడు నిర్దిష్ట భద్రతా చర్యలను పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇలా తొలగించే సమయంలోనే, ఆయా పీపీఈ కిట్లపై ఉండే వైరస్ మనుషులకు అంటుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ, ఈ విషయంలో మీకు అనుమానం ఏమైనా వస్తే, నిపుణుల సలహా సూచనలు తీసుకోండి. ఏదైనా అసైన్ మెంట్ కు వెళ్లే ముందు శిక్షణ తప్పనిసరి.

గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, కొన్ని దేశాల్లో నాణ్యమైన మెడికల్ పీపీఈ సరఫరా తగినంతగా లేదు. మరియు, తగినంత ఉత్పత్తి లేదు.

వ్యక్తిగత రక్షణ పరికరాల (డిస్పోజబుల్ గ్లవ్స్, ఫేస్ మాస్క్, ప్రొటెక్షన్ ఆప్రాన్స్, డిస్పోజబుల్ షూ కవర్లు)ను వాడటంలోనూ, తీసేయడంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన సమాచారాన్ని సీడీసీ నుంచి తెలుసుకోవాలి.   వైరస్ ఒకరినుంచి ఒకరికి పాక్ అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదు.    

కనీస నిర్దేశిత భద్రతా ప్రమాణాలను పాటించడానికి, ఎప్పుడూ కూడా ప్రఖ్యాత బ్రాండ్ల మెడికల్ పీపీఈలనే వాడండి. నాణ్యత లేని, నకిలీ పీపీఈల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రఖ్యాత, అందరూ ఆదరించే బ్రాండ్లను మీరు ఇక్కడ చూడవచ్చు.

వైరస్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి శవాగారం వంటి ప్రాంతాల నుండి రిపోర్టింగ్ చేయాల్సి వస్తే ఒకసారి వాడి పారేయదగిన పాదరక్షలు, వ్వాటర్ ప్రూఫ్ ఓవర్ షూలు వాడాలి. పని ముగించుకుని ఆ ప్రాతం నుంచి బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా వాటిని వైప్స్ సాయంతో తుడిచేయాలి.  వాటర్ ప్రూఫ్ ఓవర్ షూలు వాడాక వాటిని వేరే మరెవరూ ఉపయోగించకుండా చెత్త బుట్టలో పడేయాలి.  వైరస్ ఉన్న  ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రక్షణాత్మక చేతితొడుగులను వాడాలి. అవసరమని అనిపిస్తే బాడీ సూట్ లను, ఫేస్ మాస్కులను తప్పనిసరిగా ఉపయోగించాలి. 

శిక్షణ పొందిన నిపుణుల పర్యవేక్షణలోనే పీపీఈలను ధరించడం, తొలగించడం చేయాలి. ఎందుకంటే, ఇటువంటి సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంటుంది. సీడీసీ విడుదల చేసిన పీపీఈని ధరించడం, తొలగించడానికి సంబంధించిన ఈ వీడియో మీకు ఉపయుక్తం కావచ్చు.

వాడి పడేసే పీపీఈ అంటే, గ్లవుజులు, బాడీ సూట్లు, యాప్రాన్లు లేదా షూ కవర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ఉపయోగించవద్దు. ఒకవేళ, దేనినైనా మళ్లీ ఉపయోగించాల్సి వస్తే, దానిని శుభ్రంగా కడిగి, శుభ్రం చేసి ఉపయోగించండి.

ఫేస్ మాస్కులు

సాధారణ ప్రజల్లోకి వెళ్లి, ఇరుకైన గదుల్లో, ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వార్తలు సేకరించే పాత్రికేయులు ఫేస్ మాస్కులను సరైన విధంగా ఉపయోగించడం చాలా చాలా ముఖ్యం. మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే, ఇరుకైన గదుల్లోని గాలిలో వైరల్ డ్రాప్ లెట్ల సాంధ్రత సాధారణ గాలిలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో, మీకు వైరస్ సోకడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

జాగ్రత్త.. సరిగ్గా ఉపయోగించకపోతే, ఇన్ఫెక్షన్ సోకడానికి మాస్కులే మూలమనే ఆందోళనలూ ఉన్నాయి.  లాన్సెట్ అధ్యయనం ప్రకారం, సోకిన తర్వాత ఏడు రోజుల వరకూ గుర్తించదగిన స్థాయిలోనే సర్జికల్ మాస్కుపై వైరస్ ఉంటుంది. ఈ అధ్యయనం ప్రకారం, మాస్కును తొలగించేటప్పుడు కానీ, తిరిగి ఉపయోగించేటప్పుడు కానీ ధరించి ఉన్నప్పుడు కానీ దానిని చేతితో తాకితే ముప్పును కొని తెచ్చకున్నట్లే.

మీరు మాస్కును ధరిస్తున్నారా.. అయితే ఈ కింది సూచనలు తప్పక పాటించాలి.

ఇరుకైన ప్రాంతంలో ఇతరులకు చాలా సమీపంలో ఉండి లేదా ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతంలో వార్తలు సేకరిస్తున్నారనుకోండి. ప్రామాణిక ‘సర్జికల్’ మాస్కు కంటే ఎన్95 మాస్కు (లేదా ఎఫ్ఎఫ్ పీ2/ ఎఫ్ఎఫ్ పీ3) ఉపయోగించండి.

మాస్కు మీ ముఖాన్ని బిగుతుగా అతుక్కుని ఉండేలా చూసుకోవాలి. ఇందుకు మీ ముఖంపై వెంట్రుకలు ఏమైనా ఉంటే తొలగించుకోండి.

అనవసరంగా మాస్కులను ముట్టడం కూడా మానేయాలి. కేవలం తొడుగుకు ఇరువైపులా ఉన్న స్ట్రాప్స్ ని  ముట్టుకుని మాస్కును  తొలగించాలే తప్ప దాని ముందు భాగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు తగిలించరాదు. 

మాస్కు తీసేసిన తర్వాత చేతులు కడుక్కోవడం తప్పనిసరి లేదా ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ ను వాడడం మంచిది.    

ఎప్పటికప్పుడు మాస్కులను కొత్తవి వాడండి.. తేమగా మారిన వెంటనే వాటిని  తప్పనిసరిగా చెత్తబుట్టలో  పారవేయాలి.

మాస్క్లు కేవలం మీ శరీరంలోని ఒక భాగాన్ని మాత్రమే కాపాడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వీలైనంత వరకూ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖాన్ని అసలు తాకకూడదు. కళ్లు, నోరు, చెవులు, ముక్కును అసలు ముట్టుకోరాదు. 

మహమ్మారి విస్తరిస్తున్న సందర్భంలో మాస్కుల కొరత ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో వాటిని అధిక ధరకు విక్రయిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఈ సమాచారం పట్ల అవగాహన కలిగి ఉండటం అవసరం.

సామగ్రి భద్రత

సురక్షిత దూరంలో ఉండి వార్తలు సేకరించడానికి సాధ్యమైనంత వరకూ డైరెక్షనల్ ‘ఫిష్ పోల్’ మైక్రో ఫోన్లను (పొడవాటి రాడ్ కు చివర్లో స్పీకర్ ఉంటుంది)ఉపయోగించండి. నిర్దిష్ట పరిస్థితుల్లోనే, కచ్చితంగా పూర్తి శుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ క్లిప్ మైక్రో ఫోన్లను కూడా ఉపయోగించవచ్చు.

మైక్రో ఫోన్ కవర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.  కొత్తగా వార్తా సేకరణకు వెళుతున్న ప్రతిసారీ మైక్రో ఫోన్ కవర్లను మార్చాలి. వైరస్ ఒకరినుంచి మరొకరికి సంక్రమించకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మైక్రో ఫోన్ కవర్లను మార్చడం తప్పనిసరి. కవర్లను ఎలా తొలగించాలి, వాటిని ఏవిధంగా శుభ్రం చేయాలి అన్నవాటికి సంబందించిన శాస్త్రీయ విధానాలు తెలుసుకోవాలి. 

యాంటీ మైక్రోబియల్ వైప్స్ అయిన మెలిసెప్టోల్ ను ఉపయోగించి పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. సెల్ ఫోన్స్, టాబ్లెట్స్, లీడ్స్, ప్లగ్స్, ఇయర్ ఫోన్స్, హార్డ్ డ్రైవ్స్, కెమెరాలు, ప్రెస్ పాసులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిది.

ఉపయోగించిన పరికరాలను తిరిగి ఆఫీస్ లో ఇచ్చేటప్పుడు వాటిని పూర్తిగా శుభ్రపరచాలి.  వస్తువులను ఎలాబడితే అలా  పడేయకుండా వాటిని శుభ్రపరచే బాధ్యతలు నిర్వరిస్తున్నవారికి జాగ్రత్తగా అప్పగించాలి. 

ఉపయోగించిన వస్తువులను శుభ్రపరచడానికి ఎలాంటి పదార్థాలు అందుబాటులో లేని పక్షంలో- కొన్ని గంటలపాటు ఆ పరికరాలను సూర్య రశ్మి కింద ఉంచడం శ్రేయస్కరం.  అలా చేస్తే వైరస్ ను చాలావరకు తుదముట్టించవచ్చు.     

విధి నిర్వహణ కోసం ఏదైనా వాహనాన్ని ఉపయోగించాల్సి వస్తే దాని పరిశుభ్రత మీద దృష్టి పెట్టండి. మీరు ఆ వాహనాన్ని ఉపయోగించడానికి ముందే శిక్షణ పొందిన సిబ్బంది  దాన్ని శుభ్రపరిచేట్లు జాగ్రత్తలు తీసుకోండి. వాహనం లోపలి భాగాలు ముఖ్యంగా డోర్ హ్యాండిల్స్, స్టీరింగ్ వీల్స్, వింగ్ మిర్రర్స్, హెడ్ రెస్ట్స్, సీట్ బెల్ట్స్, డాష్ బోర్డు, విండో వైన్డర్, బటన్స్ ను పరిశుభ్రంగా ఉంచడంపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.

ఎలక్ట్రికల్ పరికరాలను శుభ్రపరచడం

ఎలక్ట్రికల్ పరికరాలను శుభ్రపరచడానికి ఈ క్రింది మార్గదర్శకాలను పాటించాలి. ఏవైనా పరికరాలను వాడేందుకు ప్రయత్నించే ముందు మీరు తయారీదారుల మార్గదర్శకాలను చదివారని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి. 

శుభ్రపరచడానికి ముందు పరికరాలకు కరెంట్ సప్లై అన్నది లేకుండా చూసుకోవాలి. ఏవైనా వైర్లు పవర్ సప్లైకు ఉంటే తీసివేయండి / తొలగించండి

వస్తువులకు దగ్గరగా ద్రవాలను దూరంగా ఉంచండి. ఏరోసోల్ స్ప్రేలు, బ్లీచెస్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దు. ఇవి ఖచ్చితంగా మీ పరికరాలను దెబ్బతీస్తాయి

మీ పరికరంపై నేరుగా ఏ పదార్థాన్ని కూడా స్ప్రే చేయవద్దు

మృదువైన, మెత్తటి బట్టను మాత్రమే వాడండి

వస్త్రాన్ని కాస్త తడిగా లేదా తేమగా చేయండి. అంతేకానీ పూర్తిగా నీళ్లు ఉండే అంత తడిగా ఉండకూడదు. వస్త్రానికి కొంత సబ్బు వేసి మీ చేతితో వస్త్రాన్ని తీసుకుని రుద్దండి.

పరికరాన్ని చాలాసార్లు తుడిచివేయండి

తేమను పరికరాల ఓపెనింగ్స్‌లోకి వెళ్లకుండా చూసుకోవాలి (ఛార్జింగ్ సాకెట్లు, ఇయర్‌ఫోన్ వంటివి సాకెట్లు, కీబోర్డులు)

మీ పరికరాన్ని శుభ్రమైన, పొడిగా ఉన్న మృదువైన వస్త్రంతో తేమ లేకుండా చేయండి

కొన్ని తయారీదారులు 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వైప్స్‌ను కఠినమైన మరియు నాన్‌పోరస్ ఉపరితలాల కోసం సిఫార్సు చేస్తారు

మీ పరికరాలను క్రిమిసంహారక మందులను ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోండి. మీ పరికరాన్ని దెబ్బతీస్తాయో లేదో వంటి విషయాలను ముందుగా తయారీదారుని క్రిమిసంహారక మందుల వివరాలను తనిఖీ చేయండి

ఈ వ్యాసం ద్వారా మరింత వివరణాత్మక మార్గదర్శకత్వం

పొందండి.

డిజిటల్సెక్యూరిటీ:

కరోనా వార్తలను రిపోర్ట్ చేసే పాత్రికేయులకు అంతర్జాల శత్రువులు పెరిగే అవకాశాలు కొట్టిపారేయలేనివి.  ఈ తరుణంలో పాత్రికేయులమీద కొందరు పనిగట్టుకుని దాడులకు తెగపడే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు దాడుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సీపీజే అందించే బెస్ట్ ప్రాక్టీసెస్ ను సమీక్షించండి.

ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు కోవిడ్-19 విస్తృతిని అంచనా వేసేందుకు పలు నిఘా సాఫ్ట్ వేర్ లను ఉపయోగిస్తూ ఉంటాయి. ఎన్.ఎస్.ఓ. గ్రూప్ పెగాసస్ స్పైవేర్ ను తయారుచేసి పాత్రికేయులనూ లక్ష్యంగా మార్చుకుందని సిటిజెన్ ల్యాబ్ వెల్లడించింది. 

కరోనా సంక్షోభం ముగిశాక ప్రస్తుతం వాడుకలో ఉన్న నిఘా సాఫ్ట్ వేర్ లను, నిఘా వ్యవస్థలను ఆయా సంస్థలు, వ్యక్తులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందేమో అని పౌర హక్కుల సంఘాలు ఆందోళన చెబుతున్నాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను తమ వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది.

వ్యక్తులు, సంస్థలపై దాడికి నేరగాళ్లు ప్రస్తుత ఆరోగ్య సంక్షోభాన్ని ఉపయోగించుకుంటున్నారు. టీకా కార్యక్రమంతో కూడిన కుంభకోణాలకు వారు పాల్పడడం సర్వసాధారణమైందనే కథనాలూ వస్తున్నాయి. కొవిడ్-19 లేదా టీకాలకు సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను డౌన్ లోడ్ చేసుకునే ముందు, లేదా లింకులను క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అత్యాధునిక ఫిషింగ్ దాడులతో మీ డివైజ్ లలోనికి మాల్ వేర్ లను చొప్పించవచ్చని ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ వివరిస్తోంది.

ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో కోవిడ్-19 కు చెందిన లింక్ లు కనిపిస్తే, వాటిని మరో ఆలోచన లేకుండా క్లిక్ చేయడమూ సరికాదు. వాటి ద్వారా మొబైళ్ళలోకి, కంప్యూటర్లలోకి  మాల్ వేర్ దిగుమతి అయ్యే ప్రమాదం ఉంది.  

కొన్ని కొన్ని సార్లు స్వయంగా ప్రభుత్వాలే పూనుకుని తప్పుడు సమాచారం అందిస్తుంటాయని గార్డియన్ పత్రిక హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినట్లు సాధారణ సమరానికి సంబంధించీ ఇలా తప్పుదోవ పట్టించే పరిస్థితులు తలెత్తవచ్చు. ఇదే విషయాన్ని బీబీసీ సైతం ప్రాధాన్యంగా చెప్పింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ వెబ్సైట్ లో మిత్ బస్టర్ గైడ్(అవాస్తవాలను ఛేదించి సత్యాన్ని వెల్లడించే మార్గదర్శిని) ను పొందుపరిచింది.    

ఆన్‌లైన్ కాన్ఫరెన్సింగ్ మరియు గోప్యతా వివరాలను చదవండి, అందువల్ల ఈ సేవలు ఏమిటో మీకు తెలుస్థాయి.

మీ డేటా విషయంలో వారికి యాక్సెస్ ఉన్నవి మరియు ఎంత సురక్షితమైనవో తెలుసుకోవచ్చు. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ఉండడంతో హ్యాకర్లు టార్గెట్ చేసే అవకాశం ఉంది.

ఏదైనా విషయాన్ని రిపోర్ట్ చేసే సమయంలో అది పక్కా సమాచారమా కాదా అన్నది ధృవీకరించుకోవాలి.  నియంతృత్వ దేశాల్లో కోవిడ్-19 సమాచారాన్ని పాత్రికేయులు ఎప్పటికప్పుడు ఎలా రిపోర్ట్ చేస్తున్నారన్న విషయాన్ని నిశితంగా గమనిస్తుంటారు.  కొన్ని ప్రభుత్వాలు సమాచారంపై నిషేధం విధించవచ్చు, సెన్సారింగ్ కి పాల్పడవచ్చు CPJ.

దాడులు జరగవచ్చు…. అప్రమత్తంగా ఉండండి!

ఒకవేళ మీరు విదేశాల్లో విధి నిర్వహణకు వెళ్లాలనుకోండి (కింద చూడండి), మీరు వెళ్లాల్సిన గమ్య స్థానంలో తాజా భద్రతా పరిస్థితులను ఒకసారి పరిశోధించండి. మహమ్మారి ప్రారంభమైన తొలి రోజుల నుంచీ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయన్న విషయం గుర్తుంచుకోండి. తమను దూషించారని, వేధించారని, అన్యాయంగా దాడి చేశారని కొంతమంది పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, భద్రత గ్యారెంటీ అనే భావన వద్దు.

కొవిడ్-19 లాక్ డౌన్ చర్యల్లో భాగంగా పోలీసలు ఉక్కుపాదం మోపుతున్నారని తెలుసుకోండి. అంటే, భౌతిక దాడులు, బాష్ప వాయు గోళాల ప్రయోగం వంటివి చేస్తున్నారు.

కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన వార్తలు రాస్తే తమను నిర్బంధించే, అరెస్టు చేసే, స్వదేశానికి పంపించి వేసే ముప్పు ఉందన్న విషయాన్ని నియంతృత్వ ప్రభుత్వాలు అమల్లో ఉన్న దేశాల్లోని పాత్రికేయులు  గుర్తుంచుకోవాలి. సీపీజే తెలియజేస్తున్న ఈ విషయాలు చూడండి.

విదేశాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు… 

ప్రపంచవ్యాప్తంగా రవాణా ఆంక్షల కారణంగా, అంతర్జాతీయ ప్రయాణం ఇప్పుడు ఓ సవాలు. ఒకవేళ, విదేశాల్లో విధి నిర్వహణ చేయాల్సి వస్తే, ఈ కింద సూచించిన అంశాలను మీరు పరిగణనలోకి తీసుకోవాలి…

నిర్దిష్ట దేశంలోని విభిన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ చర్యలు లేదా కర్ఫ్యూ వేర్వేరుగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోండి. మరో విషయం ఏమిటంటే, ముందు చెప్పి కానీ అసలు చెప్పకుండా కానీ స్థానికంగా లాక్ డౌన్ ను అమలు చేయవచ్చు. అందుకే, దేశంలో ప్రయాణ ఆంక్షలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు స్థానిక వనరులను పర్యవేక్షిస్తూ ఉండండి.

ముందు చెప్పి కానీ అసలు చెప్పకుండా కానీ తమ దేశానికి తిరిగి వచ్చినవారు క్వారంటైన్ ఉండాలనే నిబంధనలు విధించవచ్చు. లేదా అప్పటికే ఉన్న నిబంధనలను సవరించవచ్చు. మీరు ఏ దేశం నుంచి తిరిగి వస్తున్నారనే అంశాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఇటీవల స్పెయిన్ నుంచి యునైటెడ్ కింగ్ డమ్ నుంచి తిరిగి వచ్చిన వారిపై ఇటువంటి ఆంక్షలే విధించారు.

మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ అందుబాటులో ఉన్న అన్ని వైద్య చికిత్స సౌకర్యాల గురించి తెలుసుకోండి. ముందు చెప్పి కానీ చెప్పకుండా కానీ ఆరోగ్య కార్యకర్తలు స్ట్రైక్ లేదా ఆందోళనకు దిగవచ్చని గుర్తుంచుకోండి.

మెడికల్ పీపీఈ పరిమితంగానే ఉండవచ్చు. అసలు ఉండకపోవచ్చు. లేదా నాణ్యత ఉండకపోవచ్చు. అందుకే, ఎక్కడికైనా వెళ్లే ముందే, ముందుగానే అక్కడ పీపీఈ అందుబాటుకు సంబంధించి తెలుసుకోండి. అవసరమైతే, పీపీఈలను మీ వెంట తీసుకెళ్లండి.

వీలుంటే, ఏదైనా అసైన్ మెంట్ కు వెళ్లడానికి ముందే కొవిడ్ టీకా తీసుకోండి. మరియు, సంబంధిత టీకాలు మరియు మందులన్నీ సరిపడే ఉండేలా చూసుకోండి.

అవసరమైన వ్యాక్సిన్లు, రోగనిరోధక మందులు మీరు వెళుతున్న చోట మీకు అందుబాటులో ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి.  ఒక దేశం నుండి మరోదేశానికి వెళ్లిన సమయంలో జ్వరం బారిన పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు జ్వరానికి సంబంధించిన వ్యాక్సిన్ మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది

ప్రయాణ బీమా పాలసీ సాధ్యాసాధ్యాలను తరచి చూసుకోండి.  ఇప్పటికే అనేక దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ ప్రయాణాలపై వివిధ ఆంక్షలు, హెచ్చరికలు జారీ చేశాయి. 

కొవిడ్-19 కారణంగా చాలా విమానయాన సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. అందుకే, ఒకవేళ విమానం రద్దయితే టికెట్ మొత్తం తిరిగి వచ్చేందుకు వీలుగా ఫుల్లీ రిఫండబుల్ విమాన టికెట్లనే కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.

కోవిడ్-19 ప్రబలుతున్న సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి బీమా రక్షణ పొందడం చాలా కష్టమన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. 

మీరు హాజరు కాదలచిన కార్యక్రమం కాల ప్రణాళికను ఎప్పటికప్పుడు తరచి చూసుకోండి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఉన్నఫళంగా కార్యక్రమాలను రద్దు చేయవచ్చు. 

చాలా దేశాల్లో నిర్దిష్ట సంఖ్యకు మించి ప్రజలు ఒకే చోట గుమిగూడటాన్ని ప్రభుత్వ యంత్రాంగాలు అనుమతించడం లేదు. 

మీరు ప్రస్తుతం చేయదలిచిన, భవిష్యత్తులో తలపెట్టిన ప్రయాణాలకు సంబంధించి అన్ని అంశాలనూ గమనంలోకి తీసుకోండి. కొన్ని ప్రాంతాలపై విదేశీయులు వెళ్లడంపై  ప్రయాణ ఆంక్షలు, నిషేధాలు విధించవచ్చు. వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఈ తరహా ప్రయాణ నిషేధాలు ఇనుమడించే అవకాశాలే ఎక్కువ అని గమనించండి.

చాలా దేశాల సరిహద్దులను ఇప్పటికే మూసివేశారు. మరికొన్ని దేశాల ప్రభుత్వాలో ఎప్పుడైనా ఆ పని చేయవచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైతే అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టత ఉండాలి. 

జ్వర లక్షణాలు కనిపిస్తే ప్రయాణాన్ని మానుకోవడం అత్యుత్తమం. విమానాశ్రయ పరీక్షల్లో ఆ లక్షణాలు బయటపడితే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

వెళ్లాలనుకుంటున్న ప్రాంతాలకు సంబంధించి వీసాలు ఇస్తున్నారా లేదా అన్నధీ ఆరాతీయాలి. చాలా దేశాలు ఇప్పటికే వీసా ప్రాసెస్ ను నిలిపివేశాయి. 

వెళ్లాలన్న దేశంలో కాలుమోపాలంటే కోవిడ్-19 లేదన్న వైద్య ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలా అన్న వివరాలపట్ల స్పష్టత ఉండటం అవసరం.

వివిధ దేశాల్లోని విమానాశ్రయాల్లో ఆరోగ్యపరమైన స్క్రీనింగ్ లు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఊహించిన దానికన్నా చెక్ ఇన్, చెక్ ఔట్ లపై అధిక సమయం పెట్టె అవకాశం ఉంది. కాబట్టి వివిధ ప్రయాణ కేంద్రాల వద్ద  అదనపు సమయం వెచ్చించేందుకు సిద్దపడాల్సి ఉంటుంది. 

వెళ్లే ప్రాంతాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కొన్ని దేశాలకు చెందిన ఎయిర్ పోర్టు టెర్మినల్స్ లో విదేశీయులను అనుమంతించకపోవచ్చు.  

విధి  నిర్వహణ ముగించుకుని తిరిగి వచ్చాకఏం చేయాలి

ఆరోగ్యం విషయంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశం నుంచి తిరిగి వస్తే, మీరు సెల్ఫ్ ఐసొలేషన్లో ఉండాల్సి రావచ్చు. ఈ విషయంలో మరింత స్పష్టత కోసం, సంబంధిత ప్రభుత్వ సూచనలను ఓసారి పరిశీలించండి.

వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాలనుంచి తిరిగి వచ్చాక… స్వచ్ఛందంగా మీకు మీరు ఐసొలేట్ కావడం మంచిది. ఆ మేరకు ప్రభుత్వాల సూచనలు పాటించాలి.

ఎప్పటికప్పుడు కోవిడ్-19 కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. క్వారెంటైన్, ఐసొలేషన్ విధివిధానాల్లో మార్పులు తెలుసుకొని వాటిని విధిగా అనుసరించాలి.  14 రోజులపాటు జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్య స్థితి గతులపట్ల స్పష్టమైన అంచనాకు రావాలి. కోవిద్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎక్కడెక్కడ తిరిగారు, ఏయే వ్యక్తులను కలిశారు అన్న వివరాలను రాసి పెట్టుకోవాలి. తద్వారా ఒకవేళ వైరస్ ప్రభావానికి గురైతే మూల కారణాలను వెలికి తీయడానికి వీలవుతుంది.

ఒకవేళ లక్షణాలు కనిపిస్తే:

మీలో కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే మీ యాజమాన్యానికి తక్షణం సమాచారం అందించండి. ఉన్నఫళంగా వెళ్లి  ట్యాక్సీ ఎక్కకుండా… యాజమాన్యంతో చర్చించి సముచితమైన రవాణా (అంబులెన్స్ )  సాయంతో ఇళ్లకు చేరుకోవడం ఉత్తమం. 

మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడుకోడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ,  సీడీసీ, స్థానిక వైద్య వ్యవస్థలు చేసే సూచనలను, విధించిన నిబంధనలను తుచ తప్పకుండా పాటించాలి. 

మీలో కొవిడ్ లక్షణాలు ప్రారంభమైతే, కనీసం 7 రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లవద్దు. (అక్కడి ప్రభుత్వాల సూచనల ప్రకారం, కచ్చితంగా ఎన్ని రోజులు ఐసొలేషన్లో ఉండాలనే రోజులు మారవచ్చు). మీకు వైరస్ సోకినప్పుడు ఇలా చేయడం ద్వారా, మీ సమాజంలోని మిగిలిన వారిని కాపాడడానికి అవకాశం ఉంటుంది.

ఒకవేళ మీలో రోగ లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు రోజుల పాటూ ఇంటిని వీడి బయటకు వెళ్ళకండి. అలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న వారికి సమస్య విస్తరించకుండా జాగ్రత్త పడినవారవుతారు. 

వీలైనంత వరకూ, మీ ఇంట్లో కూడా ఇతరులతో నిర్దేశిత భౌతిక దూరాన్ని పాటించండి. ఇంకా అవకాశం ఉంటే, ఒక్కరే పడుకోండి.

CPJ యొక్క ఆన్‌లైన్ సేఫ్టీ కిట్ జర్నలిస్టులకు, న్యూస్‌రూమ్‌లకు భౌతిక, డిజిటల్, మానసిక భద్రతా వనరులు సాధనాలు, అలాగే ఎన్నికలు, ప్రజలకు సంబంధించిన  ప్రాథమిక భద్రతా సమాచారాన్ని అందిస్తుంది.

[Editors’ note: This advisory was originally published on February 10, 2020, and is being frequently revised. The publication date at the top reflects the most recent update.]

(ఎడిటర్స్ నోట్: వాస్తవానికి, ఈ అధికారిక ప్రకటన 2020 ఫిబ్రవరి 10వ తేదీనే ప్రచురితమైంది. అప్పటి నుంచి తరచూ దీనిని సవరిస్తున్నాం. ఈ ప్రకటనపైన ఎప్పుడు ప్రచురించామనే తేదీ ఉంటుంది. దానినిబట్టి తాజా అప్ డేట్ ను తెలుసుకోవచ్చు)