PEDRO PARDO / AFP

కరోనా వైరస్ వ్యాప్తిపై వార్తలు సేకరిస్తున్న విలేకరుల భద్రత కోసం సీపీజే జాగ్రత్తలు..

కోవిడ్-19(నావల్ కరోనా వైరస్)ను మార్చి 11, 2020న  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)  మహమ్మారిగా ప్రకటించింది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఆ సందర్బంగా  ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వైరస్ కు సంబంధించిన తాజా పరిణామాలను, వార్తలను అందించే క్రమంలో  జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనా వైరస్  రిసోర్స్ సెంటర్ విశ్వసనీయమైన, ఆధారపడదగిన  వనరుగా అందుబాటులో ఉంది.  

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విపత్కరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన అనిశ్చిత వాతావరణంలో పాత్రికేయులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందో  దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో  ప్రజలకు తెలియజేస్తోంది జర్నలిస్టులే.  బాధ్యతల నిర్వహణలో భాగంగా పాత్రికేయులు అనేక ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఎంతోమందిని కలిసి ఇంటర్వ్యూలు చేయాల్సి ఉంటుంది. నిరంతర  ప్రయాణాలు, ఎప్పుడూ ఎవరో  ఒకరిని కలుస్తూ ఉండటం వల్ల పాత్రికేయులు కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యే అవకాశాలు కొట్టిపారేయలేనివి.

వైరస్ విస్తరణ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనాకు సంబంధించి వెలికి వస్తున్న వివరాలను సంబంధిత వ్యవస్థలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాయి.   కరోనా విస్తృతి, ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంబంధిత యంత్రాంగాలు సూచనలు సలహాలు అందిస్తూనే ఉంటాయి. తాజా సలహాలు, నిబంధనలు, నియంత్రణలకోసం  ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటూ స్థానిక వైద్య ఆరోగ్య వ్యవస్థలు అందించే సమాచారాన్నీ పాత్రికేయులు తెలుసుకుంటూ  ఉండాలి. 

విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాల్సిందే..!

అంతర్జాతీయ ప్రయాణాలపై పెద్దఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టి, చాలావరకు మీడియా సిబ్బంది కొంతకాలంపాటు స్వదేశాల్లోనే ఉంటూ తమ విధులు నిర్వర్తించాల్సి రావచ్చు.  ప్రపంచవ్యాప్త పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఎలాంటి సమాచారం లేకుండానే లేదా చివరి నిమిషంలో అందే వర్తమానాల మేరకు మీడియా సిబ్బంది తమ కార్యక్రమాలను ఒక్కపెట్టున మార్చుకోవాల్సి రావచ్చు. 

కోవిడ్-19 వార్తా ప్రక్రియలో నిమగ్నమైన పాత్రికేయులారా… జాగ్రత్త జాగ్రత్త!

ప్రీ అసైన్మెంట్:

అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సి.డి.సి.) ఇచ్చిన నివేదిక ప్రకారం వయసు పైబడిన వారికి, ఇతరేతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  పెద్ద వయస్కులు, ఆరోగ్య  సమస్యలతో సతమతమవుతున్న మీడియా సిబ్బంది జనబాహుళ్యాన్ని నేరుగా కలిసి నిర్వర్తించాల్సిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడమే శ్రేయస్కరం. ఈ తరహా విధులనుంచి కడుపుతో ఉన్న పాత్రికేయులకూ మినహాయింపు ఇవ్వడం మంచిది.  కోవిద్-19 వార్తలు సేకరిస్తున్న విదేశీ పాత్రికేయులపై జాత్యహంకార దాడులు చోటుచేసుకుంటున్న విషయాన్ని బజ్ ఫీడ్, ఆడిస్ అబాబాలోని అమెరికా రాయబార కార్యాలయం ఇటీవల వెల్లడించడంతోపాటు ఆమేరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్నీ నొక్కిచెప్పాయి. కోవిడ్-19 విస్తరించే కొద్దీ ఈ తరహా దాడులు పెరిగే అవకాశం ఉంది.  కరోనా పరిణామాలను తెలుసుకోవడం కోసం సిబ్బందిని ఎంపిక చేసే క్రమంలో  జర్నలిస్టులపై కొన్ని దేశాల్లో జాత్యహంకార దాడులు జరిగే అవకాశం ఉందన్న విషయాన్నీ యాజమాన్యాలు దృష్టిలో ఉంచుకోక తప్పదు.  వార్తా సేకరణ క్రమంలో అనారోగ్యం బారిన పడితే  ఎలాంటి సహాయ సహకారాలు పాత్రికేయులకు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని యాజమాన్యంతో చేర్చాలి. కొంతకాలం పాటు ‘లాక్ డౌన్, వ్యక్తిగత ఐసోలేషన్’ పాటించాల్సి వస్తే యాజమాన్య బృందం ఎలా సహకరిస్తుంది, అందుకు సంబంధించి వారి ప్రణాళికలేమిటి అన్న విషయాలనూ కూలంకషంగా చర్చించాలి. 

మానసిక స్థైర్యం కీలకం:

ప్రమాదకరంగా విస్తరిస్తున్న కోవిద్ – 19  సమాచార సేకరణకు పాత్రికేయులు సమాయత్తమైతే తొలుత ఆందోళన చెందేది వారి వారి కుటుంబ సభ్యులే. విధుల నిర్వహణకు వెళుతున్న ప్రాంతంలో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో తెలియజెప్పాలి. ఆమేరకు కుటుంబ సభ్యుల భయాలేమిటో అడిగి తెలుసుకోవాలి. వారితో మనసు  విప్పి చర్చించాలి.  కుటుంబ సభ్యుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు మీడియా సంస్థకు చెందిన వైద్య సలహాదారులతో వారిని మాట్లాడించాలి. కోవిడ్-19 వైరస్ ప్రబలిన ప్రాంతాల నుంచి రిపోర్టింగ్ చేయడం కలిగించే మానసిక ఒత్తిడిని పరిగణనలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా  ఆసుపత్రుల నుండి, ఐసొలేషన్ సెంటర్ల నుండి రిపోర్టింగ్ చేయడం తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. ఈ పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే పాత్రికేయులకు  ‘డార్ట్ సెంటర్ ఫర్ జర్నలిజం అండ్ ట్రౌమా‘ అవసరమైన సమాచారం అందించి, సరైన దిశా నిర్దేశం చేస్తోంది. 

వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి:

చాలా దేశాల్లో సామాజిక దూరాన్ని అవలంబిస్తూ ఉన్నారు. జర్నలిస్టులు కూడా దాన్ని పాటించడం మంచిదే..!  వైద్యశాలలు, మార్చురీ, క్వారంటైన్ ప్రాంతం, వృద్దాశ్రమాలు, జంతు కబేళాలు, జన సమ్మర్థం మరీ ఎక్కువగా ఉండే  ప్రదేశాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో ముందే సమాచారం సేకరించండి.  అనుమానం వస్తే ఆ ప్రదేశాలకు వెళ్ళకండి. 

సమస్య బారిన పడకుండా పాటించాల్సిన ప్రమాణాలు: 

ప్రతి ఒక్కరికీ కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండాలి. ఎవరైతే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి దూరంగా ఉండడమే మంచిది. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా మేలు.

వయసు పైబడిన వ్యక్తులను, రోగ లక్షణాలు ఉన్న వారిని ఇంటర్వ్యూ చేసే సమయంలో జర్నలిస్టులు చాలా జాగ్రత్తగా ఉంటూ వీలైనంత దూరం పాటించాలి. కోవిద్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలనూ, తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో  పనిచేస్తున్న  ఉద్యోగులను ఇంటర్ వ్యూ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ.. వీలైనంత దూరం ఉండాలి.

చేతులను వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. 20 సెకండ్ల పాటూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అది కూడా సరైన విధానంలో కడుక్కోవాలి. చేతులను శుభ్రంగా తుడుచుకోవాలి. ఇతర వస్తువులను తాకినా వెంటనే చేతులు కడుక్కోవడం ముఖ్యం. చేతులు శుభ్రంగా ఎలా కడుక్కోవాలి అన్న నియమావళిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో పొందుపరిచారు.    

వేడి నీళ్లు, సోప్ అందుబాటులో లేని సమయంలో యాంటీ-బాక్టీరియల్ జెల్ ను, వైప్స్ ను వినియోగించండి.(ఆల్కహాల్ ఉన్న శానిటైజర్లను వినియోగించమని CDC చెబుతోంది)  హ్యాండ్ వాష్ చేయకున్నా పర్వాలేదు.. శానిటైజర్లను వాడితే చాలు అని మాత్రం అనుకోకండి.

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తప్పకుండా ముక్కుకు, నోటికి టిస్యూ పేపర్ ను అడ్డుపెట్టుకోండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాడిన టిష్యూలను వెంటనే డస్ట్ బిన్ లలో వేసేయండి. ఆ తర్వాత చేతులు కడగడం మాత్రం మరువద్దు.

ముఖాన్ని, ముక్కును, నోటిని, చెవులను తాకడం మానుకోవాలి.

కరచాలనం ఇవ్వడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి వాటిని మానేస్తే చాలా మంచిది. అందుకు ప్రత్యామ్నాయంగా పరస్పరం మోచేతులు తగిలించి (ఎల్బో) అభినందనలు తెలుపుకోవడమో, పాదాలను తాటించి (లెగ్ బంప్) శుభకామనాలు తెలుపుకోవడమో అలవాటు చేసుకోండి. 

ఇతరులు వాడిన పాత్రల్లో తినడం, తాగడాన్ని సాధ్యమైనంతవరకూ మానుకోవాలి. 

విధి నిర్వహణలో  ఆభరణాలను, గడియారాన్ని తీసేయడం చాలా మంచిది. ఎందుకంటే కోవిద్-19 వైరస్ పలు లోహాల మీద నిర్దిష్టకాలం పాటు సజీవంగా ఉంటుంది. 

కళ్లద్దాలు వాడే అలవాటు ఉంటే వాటిని వేడి నీటితోనూ, సబ్బు నీటితోనూ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.

శుభ్రంగా ఉతకడానికి వీలుగా ఉండే బట్టలనే ధరించడం ఉత్తమం. కొన్ని వస్త్ర రకాలమీద వైరస్ దీర్ఘ కాలం పాటు సజీవంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుచుకోవాలి.  వేసుకున్న బట్టలను విధి నిర్వహణ తరవాత అధిక ఉష్ణోగ్రత కలిగిన నీటిలో డిటర్జెంట్ ను ఉపయోగించి ఉతకడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.

మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే  ప్రజా రవాణాను ఉపయోగించకపోవడం అత్యుత్తమం. ముఖ్యంగా రద్దీ సమయాల్లో జనసమ్మర్థ ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఏవైనా హ్యాండిల్స్ ను ముట్టుకున్నా వెంటనే శానిటైజర్లను వాడండి. సొంత వాహనంలో వెళ్లే సమయంలో పక్కన  వైరస్ సోకిన  ప్రయాణికుడు ఉంటే ప్రమాదం సోకె అవకాశాలు అత్యధికంగా ఉంటాయన్న విషయాన్ని గమనంలో ఉంచుకోండి. 

పని చేసే సమయంలో వీలైనన్ని ఎక్కువ సార్లు విరామాలు తీసుకోవడం మంచిది. తీవ్రమైన పని ఒత్తిడిలో, బాగా అలసిపోయినప్పుడు పారిశుధ్యానికి సంబందించిన మౌలిక విషయాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది.  ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకే ప్రయత్నించండి. కొందరు ఉద్యోగం అయిపోయాక చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవడం చాలా మంచిది.

కోవిడ్-19 ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు, అక్కడి నుంచి  వెళ్లినపోతున్నప్పుడు, మరో ప్రాంతానికి చేరుకున్నప్పుడు చేతులు కడగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరవద్దు.

కోవిడ్-19 లక్షణాలైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు  లాంటివి కనిపిస్తే ఎలాంటి వైద్య సాయం  తీసుకోగలరో ఆలోచించండి. చాలా వరకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలన్నీ ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లలోంచి బయటికి రాకుండా ఎక్కడి వారు అక్కడే ఒంటరిగా ఉండటమే ఉత్తమమని సూచిస్తున్నాయి.  దానివల్ల వైరస్ ఇతరులకు వ్యాపింపజేసే అవకాశాలు తగ్గిపోతాయి. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారమివ్వాలి.  

ఉడికించిన మాంసాన్ని, కోడి గుడ్లను మాత్రమే తినాలి.

మీ వస్తు సామగ్రికి వైరస్ ను అంటనివ్వద్దు!!!

‘ఫిష్ పోల్’ మైక్రో ఫోన్స్ (పొడవాటి రాడ్ కు చివర్లో స్పీకర్ ఉంటుంది) ఎక్కువగా ఉపయోగించాలి. క్లిప్ మైక్ ల కంటే వీటిని వాడడం ద్వారానే సాధ్యమైనంత వరకు వైరస్ దూరంగా ఉండవచ్చు.  

మైక్రో ఫోన్ కవర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.  కొత్తగా వార్తా సేకరణకు వెళుతున్న ప్రతిసారీ మైక్రో ఫోన్ కవర్లను మార్చాలి. వైరస్ ఒకరినుంచి మరొకరికి సంక్రమించకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మైక్రో ఫోన్ కవర్లను మార్చడం తప్పనిసరి. కవర్లను ఎలా తొలగించాలి, వాటిని ఏవిధంగా శుభ్రం చేయాలి అన్నవాటికి సంబందించిన శాస్త్రీయ విధానాలు తెలుసుకోవాలి. 

యాంటీ మైక్రోబియల్ వైప్స్ అయిన మెలిసెప్టోల్ ను ఉపయోగించి పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. సెల్ ఫోన్స్, టాబ్లెట్స్, లీడ్స్, ప్లగ్స్, ఇయర్ ఫోన్స్, హార్డ్ డ్రైవ్స్, కెమెరాలు, ప్రెస్ పాసులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిది.

ఉపయోగించిన పరికరాలను తిరిగి ఆఫీస్ లో ఇచ్చేటప్పుడు వాటిని పూర్తిగా శుభ్రపరచాలి.  వస్తువులను ఎలాబడితే అలా  పడేయకుండా వాటిని శుభ్రపరచే బాధ్యతలు నిర్వరిస్తున్నవారికి జాగ్రత్తగా అప్పగించాలి. 

ఉపయోగించిన వస్తువులను శుభ్రపరచడానికి ఎలాంటి పదార్థాలు అందుబాటులో లేని పక్షంలో- కొన్ని గంటలపాటు ఆ పరికరాలను సూర్య రశ్మి కింద ఉంచడం శ్రేయస్కరం.  అలా చేస్తే వైరస్ ను చాలావరకు తుదముట్టించవచ్చు. 

విధి నిర్వహణ కోసం ఏదైనా వాహనాన్ని ఉపయోగించాల్సి వస్తే దాని పరిశుభ్రత మీద దృష్టి పెట్టండి. మీరు ఆ వాహనాన్ని ఉపయోగించడానికి ముందే శిక్షణ పొందిన సిబ్బంది  దాన్ని శుభ్రపరిచేట్లు జాగ్రత్తలు తీసుకోండి. వాహనం లోపలి భాగాలు ముఖ్యంగా డోర్ హ్యాండిల్స్, స్టీరింగ్ వీల్స్, వింగ్ మిర్రర్స్, హెడ్ రెస్ట్స్, సీట్ బెల్ట్స్, డాష్ బోర్డు, విండో వైన్డర్, బటన్స్ ను పరిశుభ్రంగా ఉంచడంపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. 

మీ భద్రత… మీ బాధ్యత

వ్యక్తిగత రక్షణ పరికరాల (డిస్పోజబుల్ గ్లవ్స్, ఫేస్ మాస్క్, ప్రొటెక్షన్ ఆప్రాన్స్, డిస్పోజబుల్ షూ కవర్లు)ను వాడటంలోనూ, తీసేయడంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన సమాచారాన్ని సీడీసీ నుంచి తెలుసుకోవాలి.   వైరస్ ఒకరినుంచి ఒకరికి పాక్ అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదు.    

వైరస్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి శవాగారం వంటి ప్రాంతాల నుండి రిపోర్టింగ్ చేయాల్సి వస్తే ఒకసారి వాడి పారేయదగిన పాదరక్షలు, వ్వాటర్ ప్రూఫ్ ఓవర్ షూలు వాడాలి. పని ముగించుకుని ఆ ప్రాతం నుంచి బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా వాటిని వైప్స్ సాయంతో తుడిచేయాలి.  వాటర్ ప్రూఫ్ ఓవర్ షూలు వాడాక వాటిని వేరే మరెవరూ ఉపయోగించకుండా చెత్త బుట్టలో పడేయాలి.  వైరస్ ఉన్న  ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రక్షణాత్మక చేతితొడుగులను వాడాలి. అవసరమని అనిపిస్తే బాడీ సూట్ లను, ఫేస్ మాస్కులను తప్పనిసరిగా ఉపయోగించాలి. 

కోవిద్-19 వైరస్ లక్షణాలు లేని వాళ్ళు ఫేస్ మాస్కులను వాడాల్సిన అవసరం లేదని CDC, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  చెబుతున్నాయి. కానీ, స్థానిక అధికారులు ఒక వేళ వాటిని ఉపయోగించడం తప్పని సరి అంటే మాత్రం మీరు అందుకు సంసిద్ధంగా ఉండాలి.  వైరస్ సోకే ప్రాంతాలైనటువంటి ఆసుపత్రుల్లోనూ, వైరస్ సోకిన వ్యక్తులున్న చోట విధులు నిర్వర్తిస్తున్నప్పుడూ మాస్కులు వాడాల్సిందే. చాలా దేశాల్లో ఫేస్ మాస్కుల కొరత ఉంది. కాబట్టి పెద్దగా అవసరం లేకపోయినా వాటిని వాడితే అత్యవసరమైన వారికి అవి అందకుండా పోతాయి. 

సర్జికల్ మాస్కులు ఉపయోగించడం కన్నా N95 మాస్కులు వాడడమే అత్యుత్తమం. ముక్కుకు, గెడ్డానికి సరిపోయే తరహా మాస్కుని ఎంచుకోవడంపై దృష్టి పెట్టండి. గెడ్డాలు, మీసాలు ఎప్పటికప్పుడు తీసివేయడం మంచిది.

అనవసరంగా మాస్కులను ముట్టడం కూడా మానేయాలి. కేవలం తొడుగుకు ఇరువైపులా ఉన్న స్ట్రాప్స్ ని  ముట్టుకుని మాస్కును  తొలగించాలే తప్ప దాని ముందు భాగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు తగిలించరాదు. 

మాస్కు తీసేసిన తర్వాత చేతులు కడుక్కోవడం తప్పనిసరి లేదా ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ ను వాడడం మంచిది.    

ఎప్పటికప్పుడు మాస్కులను కొత్తవి వాడండి.. తేమగా మారిన వెంటనే వాటిని  తప్పనిసరిగా చెత్తబుట్టలో  పారవేయాలి.

మాస్క్లు కేవలం మీ శరీరంలోని ఒక భాగాన్ని మాత్రమే కాపాడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వీలైనంత వరకూ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖాన్ని అసలు తాకకూడదు. కళ్లు, నోరు, చెవులు, ముక్కును అసలు ముట్టుకోరాదు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ కాటన్ మాస్కులను ఉపయోగించకూడదు.

మహమ్మారి విస్తరిస్తున్న సందర్భంలో మాస్కుల కొరత ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో వాటిని అధిక ధరకు విక్రయిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఈ సమాచారం పట్ల అవగాహన కలిగి ఉండటం అవసరం.

డిజిటల్ సెక్యూరిటీ:

కరోనా వార్తలను రిపోర్ట్ చేసే పాత్రికేయులకు అంతర్జాల శత్రువులు పెరిగే అవకాశాలు కొట్టిపారేయలేనివి.  ఈ తరుణంలో పాత్రికేయులమీద కొందరు పనిగట్టుకుని దాడులకు తెగపడే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించి సీజేసీ నియమావళిని సమీక్షించుకోవాలి. 

ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు కోవిడ్-19 విస్తృతిని అంచనా వేసేందుకు పలు నిఘా సాఫ్ట్ వేర్ లను ఉపయోగిస్తూ ఉంటాయి. ఎన్.ఎస్.ఓ. గ్రూప్ పెగాసస్ స్పైవేర్ ను తయారుచేసి పాత్రికేయులనూ లక్ష్యంగా మార్చుకుందని సిటిజెన్ ల్యాబ్ వెల్లడించింది. 

కరోనా సంక్షోభం ముగిశాక ప్రస్తుతం వాడుకలో ఉన్న నిఘా సాఫ్ట్ వేర్ లను, నిఘా వ్యవస్థలను ఆయా సంస్థలు, వ్యక్తులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందేమో అని పౌర హక్కుల సంఘాలు ఆందోళన చెబుతున్నాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను తమ వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది.

జర్నలిస్టులు కోవిడ్-19 కు చెందిన డేటాను డౌన్లోడ్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి విపత్కర సమయాల్లో కొందరు సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అలాగే ప్రజల్లో భయాందోళనలను కలిగించేలా వార్తలనూ  వ్యాప్తి చేసే అవకాశం ఉంది. డౌన్లోడ్ డేటా విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోతే కంప్యూటర్లలోకి మాల్ వేర్ జొరబడి ప్రమాదం ఉందని ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ హెచ్చరిస్తోంది. 

ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో కోవిడ్-19 కు చెందిన లింక్ లు కనిపిస్తే, వాటిని మరో ఆలోచన లేకుండా క్లిక్ చేయడమూ సరికాదు. వాటి ద్వారా మొబైళ్ళలోకి, కంప్యూటర్లలోకి  మాల్ వేర్ దిగుమతి అయ్యే ప్రమాదం ఉంది.  

కోవిడ్-19  ట్రాకర్ వంటి ప్రమాదకరమైన యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.  కొన్ని యాప్ లను డౌన్లోడ్ చేసుకుంటే అవి మన కంప్యూటర్లను తమ స్వాధీనంలోకి తీసుకుని పెద్దఎత్తున డబ్బులు డిమాండ్ చేసే ప్రమాదం ఉంది.  

కోవిడ్-19 కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చూపించే కొన్ని వెబ్ సైట్లు డేటాను, పాస్ వర్డ్స్ ను తస్కరించే అవకాశం లేకపోలేదు.

కొన్ని కొన్ని సార్లు స్వయంగా ప్రభుత్వాలే పూనుకుని తప్పుడు సమాచారం అందిస్తుంటాయని గార్డియన్ పత్రిక హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినట్లు సాధారణ సమరానికి సంబంధించీ ఇలా తప్పుదోవ పట్టించే పరిస్థితులు తలెత్తవచ్చు. ఇదే విషయాన్ని బీబీసీ సైతం ప్రాధాన్యంగా చెప్పింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ వెబ్సైట్ లో మిత్ బస్టర్ గైడ్(అవాస్తవాలను ఛేదించి సత్యాన్ని వెల్లడించే మార్గదర్శిని) ను పొందుపరిచింది.    

మెసేజింగ్ యాప్స్ ద్వారా వైరల్ అయ్యే చాలా విషయాల్లో అసత్యాలు ఉండవచ్చు. వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఫేస్ బుక్ లాంటి సైట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కోవిడ్-19  సమాచారాన్ని ఎప్పటికప్పుడు జల్లెడ పడుతున్నాయి. ఈ సమాచార విశ్లేషణలో మానవ ప్రమేయాన్ని ఈ తరహా వెబ్సైట్ బాగా తగ్గించేశాయి. అయితే కొన్ని సందర్భాల్లో కచ్చితమైన సమాచారమూ సాంకేతిక కారణాల రీత్యా ఈ సైట్లనుంచి ‘ఎర్రర్‘ పేరిట తొలగిపోతున్నదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.  

ఏదైనా విషయాన్ని రిపోర్ట్ చేసే సమయంలో అది పక్కా సమాచారమా కాదా అన్నది ధృవీకరించుకోవాలి.  నియంతృత్వ దేశాల్లో కోవిడ్-19 సమాచారాన్ని పాత్రికేయులు ఎప్పటికప్పుడు ఎలా రిపోర్ట్ చేస్తున్నారన్న విషయాన్ని నిశితంగా గమనిస్తుంటారు.  కొన్ని ప్రభుత్వాలు సమాచారంపై నిషేధం విధించవచ్చు, సెన్సారింగ్ కి పాల్పడవచ్చు CPJ.

దాడులు జరగవచ్చు…. అప్రమత్తంగా ఉండండి!

కోవిడ్-19 ప్రబలుతున్న తరుణంలో కారాగారాలనుంచి రిపోర్టింగ్ చేసే విషయంలో పాత్రికేయులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వారిపై ఖైదీలు దాడిచేసే అవకాశాలూ ఉన్నాయి. ఇటలీ, కొలంబియా, ఇండియా లలో ఇటీవల ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. 

పలు దేశాల్లో ఖైదీలను విడిచిపెడుతూ ఉన్నారు. అలా చేయడం వలన నేరాల విస్తృతి కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. కోవిద్-19 కారణంగా అమెరికా, ఐర్ ల్యాండ్, పాలస్తీనా, ఇరాన్ లాంటి దేశాల్లో ఖైదీలను విడిచిపెట్టారు. తినడానికి తిండి లభించని పరిస్థితులు తలెత్తినప్పుడు లూటీలు, దొంగతనాలూ జరిగే ప్రమాదం ఉంటుంది.   

నియంతృత్వ దేశాల్లో పనిచేస్తూ కోవిడ్-19 వార్తా సేకరణ చేస్తున్న పాత్రికేయులను అక్కడి ప్రభుత్వాలు అరెస్ట్ చేసే ప్రమాదమూ ఉందని సీపీజే హెచ్చరించింది.  విధి నిర్వహణలో భాగంగా అంతర్జాతీయ ప్రయాణాలు చేయాల్సి వస్తే, మీరు వెళ్లే చోట్ల శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పటివరకూ ఇజ్రాయెల్, బ్రెజిల్, పాకిస్తాన్, సైప్రస్, రీయూనియన్, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో  హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.   ఇరాక్, హాంగ్ కాంగ్ లాంటి దేశాల్లో కోవిడ్-19 సృష్టించిన కలకలం సంఘర్షణలను తీవ్రతరం చేసే అవకాశాలున్నాయి.

విదేశాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు… 

అవసరమైన వ్యాక్సిన్లు, రోగనిరోధక మందులు మీరు వెళుతున్న చోట మీకు అందుబాటులో ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి.  ఒక దేశం నుండి మరోదేశానికి వెళ్లిన సమయంలో జ్వరం బారిన పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు జ్వరానికి సంబంధించిన వ్యాక్సిన్ మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది

ప్రయాణ బీమా పాలసీ సాధ్యాసాధ్యాలను తరచి చూసుకోండి.  ఇప్పటికే అనేక దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ ప్రయాణాలపై వివిధ ఆంక్షలు, హెచ్చరికలు జారీ చేశాయి. బ్రిటీష్ ఫారెన్ అండ్ కామన్ వెల్త్ కార్యాలయం, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, ఫ్రాన్స్ లు అంతర్జాతీయ ప్రయాణాలు మానుకోమని ఇప్పటికే సూచించాయి. కోవిడ్-19 ప్రబలుతున్న సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి బీమా రక్షణ పొందడం చాలా కష్టమన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. 

మీరు హాజరు కాదలచిన కార్యక్రమం కాల ప్రణాళికను ఎప్పటికప్పుడు తరచి చూసుకోండి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఉన్నఫళంగా కార్యక్రమాలను రద్దు చేయవచ్చు. 

చాలా దేశాల్లో నిర్దిష్ట సంఖ్యకు మించి ప్రజలు ఒకే చోట గుమిగూడటాన్ని ప్రభుత్వ యంత్రాంగాలు అనుమతించడం లేదు. 

మీరు ప్రస్తుతం చేయదలిచిన, భవిష్యత్తులో తలపెట్టిన ప్రయాణాలకు సంబంధించి అన్ని అంశాలనూ గమనంలోకి తీసుకోండి. కొన్ని ప్రాంతాలపై విదేశీయులు వెళ్లడంపై  ప్రయాణ ఆంక్షలు, నిషేధాలు విధించవచ్చు. వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఈ తరహా ప్రయాణ నిషేధాలు ఇనుమడించే అవకాశాలే ఎక్కువ అని గమనించండి.

చాలా దేశాల సరిహద్దులను ఇప్పటికే మూసివేశారు. మరికొన్ని దేశాల ప్రభుత్వాలో ఎప్పుడైనా ఆ పని చేయవచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైతే అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టత ఉండాలి. 

అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో వివిధ దేశాలు కచ్చితమైన ఆంక్షలు విధిస్తున్నాయి. దాదాపు అన్ని విమానాశ్రయాల్లో నిక్కచ్చిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వర్తిస్తున్నారు. ఒకవేళ కోవిద్ లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. కొంతమందిని హోమ్ క్వారెంటైన్స్ లోనూ ఉంచుతున్నారు. జ్వర లక్షణాలు కనిపిస్తే ప్రయాణాన్ని మానుకోవడం అత్యుత్తమం. విమానాశ్రయ పరీక్షల్లో ఆ లక్షణాలు బయటపడితే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విమాన సర్వీసులు రద్దయ్యాయి. కోవిడ్-19 వ్యాప్తి మరీ ఎక్కువైతే కచ్చితంగా మరిన్ని విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  కాబట్టి ఒకవేళ టికెట్ రద్దు చేసుకున్నా పూర్తి డబ్బు వెనక్కి వచ్చే వెసలుబాటు ఉండే పద్దతిలో టికెట్లు కొనుక్కోవడం మేలు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంవల్ల చాలా విమానయాన కంపెనీలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఐరోపాకు చెందిన ప్రాతీయ విమానయాన సంస్థ ఫ్లయ్బ్  ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిందని IATA తెలిపింది.    

మీ వెంట తీసుకుని వెళ్లే వస్తువుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. విస్తరించిన భయాందోళనల కారణంగా వివిధ దేశాల్లో ప్రజలు అవసరం ఉన్నా లేకపోయినా అనేక వస్తువులను విపరీతంగా కొనేశారు. అనేక చోట్ల మౌలికమైన అవసరాలకూ కొరత ఏర్పడింది. టాయిలెట్ పేపర్ కూడా కొన్ని చోట్ల లభించడం లేదు. ఫేస్ మాస్కులు, సోప్, హ్యాండ్ శానిటైజర్లు, నిలువ ఉంచిన ఫుడ్, టాయిలెట్ పేపర్ వంటి వాటికీ కటకట నెలకొంది.  మీరు వెళ్లే ప్రాంతాల్లో అవి దొరకకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆరోగ్య కార్యకర్తల కొరత కారణంగా పరిస్థితులు విషమించే ప్రమాదమూ ఉంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రయాణానికి ప్రణాళికలు రూపొందించుకోండి. 

జోర్దాన్ లాంటి దేశాల్లో మంచి నీరు కూడా సరిగా దొరకని పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో అది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. అలాంటి ప్రాంతాలకు వెళ్లే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వెళ్లాలనుకుంటున్న ప్రాంతాలకు సంబంధించి వీసాలు ఇస్తున్నారా లేదా అన్నధీ ఆరాతీయాలి. చాలా దేశాలు ఇప్పటికే వీసా ప్రాసెస్ ను నిలిపివేశాయి. 

వెళ్లాలన్న దేశంలో కాలుమోపాలంటే కోవిడ్-19 లేదన్న వైద్య ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలా అన్న వివరాలపట్ల స్పష్టత ఉండటం అవసరం.

వివిధ దేశాల్లోని విమానాశ్రయాల్లో ఆరోగ్యపరమైన స్క్రీనింగ్ లు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఊహించిన దానికన్నా చెక్ ఇన్, చెక్ ఔట్ లపై అధిక సమయం పెట్టె అవకాశం ఉంది. కాబట్టి వివిధ ప్రయాణ కేంద్రాల వద్ద  అదనపు సమయం వెచ్చించేందుకు సిద్దపడాల్సి ఉంటుంది. 

వెళ్లే ప్రాంతాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కొన్ని దేశాలకు చెందిన ఎయిర్ పోర్టు టెర్మినల్స్ లో విదేశీయులను అనుమంతించకపోవచ్చు.  

మీరు వెళ్లబోయే ప్రాంతాల్లో స్థానికంగా అమలవుతున్న ప్రయాణపరమైన ఆంక్షల గురించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం కీలకం. 

విధి  నిర్వహణ ముగించుకుని తిరిగి వచ్చాక … ఏం చేయాలి? 

ఆరోగ్యం విషయంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాలనుంచి తిరిగి వచ్చాక… స్వచ్ఛందంగా మీకు మీరు ఐసొలేట్ కావడం మంచిది. ఆ మేరకు ప్రభుత్వాల సూచనలు పాటించాలి.

ఎప్పటికప్పుడు కోవిడ్-19 కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. క్వారెంటైన్, ఐసొలేషన్ విధివిధానాల్లో మార్పులు తెలుసుకొని వాటిని విధిగా అనుసరించాలి.  14 రోజులపాటు జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్య స్థితి గతులపట్ల స్పష్టమైన అంచనాకు రావాలి. కోవిద్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎక్కడెక్కడ తిరిగారు, ఏయే వ్యక్తులను కలిశారు అన్న వివరాలను రాసి పెట్టుకోవాలి. తద్వారా ఒకవేళ వైరస్ ప్రభావానికి గురైతే మూల కారణాలను వెలికి తీయడానికి వీలవుతుంది.

ఒకవేళ లక్షణాలు కనిపిస్తే:

మీలో కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే మీ యాజమాన్యానికి తక్షణం సమాచారం అందించండి. ఉన్నఫళంగా వెళ్లి  ట్యాక్సీ ఎక్కకుండా… యాజమాన్యంతో చర్చించి సముచితమైన రవాణా (అంబులెన్స్ )  సాయంతో ఇళ్లకు చేరుకోవడం ఉత్తమం. 

మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడుకోడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ,  సీడీసీ, స్థానిక వైద్య వ్యవస్థలు చేసే సూచనలను, విధించిన నిబంధనలను తుచ తప్పకుండా పాటించాలి. 

ఒకవేళ మీలో రోగ లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు రోజుల పాటూ ఇంటిని వీడి బయటకు వెళ్ళకండి. అలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న వారికి సమస్య విస్తరించకుండా జాగ్రత్త పడినవారవుతారు. 

క్వారంటైన్ సమయంలో మీకు  కావాల్సిన వస్తువులను మీ స్నేహితులు, సహోద్యోగులు, బంధువుల సాయంతో తెప్పించుకోండి. ఎవరినీ దగ్గరికి రానివ్వకండి. అవసరమైన వస్తువులను ఇంటి తలుపు దగ్గర పెట్టి వెళ్ళమంది చెప్పండి. అందరికీ కనీసం రెండు మీటర్ల దూరం ఉండేట్లు మీ జీవన శైలిని మలచుకోండి.

ఒక్కరే పడుకోడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇతరులతో గదిని పంచుకున్నా, వారు కూడా 14 రోజుల పాటూ ఐసొలేషన్ లో ఉండాలి. ఆ సమయంలో స్నానాలగది, వంట రూమ్ వంటి వాటిని ఉపయోగించడానికి సంబంధించి అత్యంత జాగ్రత్తగా మసలుకోండి. తద్వారా వైరస్ మరొకరికి విస్తరించకుండా జాగ్రత్తపడండి. 

సబ్బు, వేడి నీళ్లు ఉపయోగించి ఎప్పటికప్పుడు 20 సెకెండ్ల పాటూ చేతులను శుభ్రంగా కడగాలి.

విధి నిర్వహణ ముగించుకుని వచ్చాక మీరు సాధ్యమైనంత వరకు వయసు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.  

కొన్ని దేశాల్లో మిమ్మల్ని మీరు ఐసొలేట్ చేసుకోవాల్సి వస్తే ఆరోగ్య శాఖ అధికారులకు ప్రతిసారీ  ఆ వివరాలను తెలియజేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు.  ఒకవేళ ఐసోలేషన్ సమయంలో మీ ఆరోగ్య పరిస్థితి విషమిస్తే, లక్షణాలు ముమ్మరిస్తే ఆ విషయాలను తెలియచెబుతూ వైద్య సిబ్బందికి తక్షణం సమాచారం ఇవ్వాలి.